ఏపీలో సిటీ స్కాన్ ధర రూ.3 వేలు

ఏపీలో సిటీ స్కాన్ ధర రూ.3 వేలు
  • ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు –ఏపీ ప్రభుత్వం

అమరావతి: కరోనా మహమ్మారి సునామీలా చుట్టేస్తున్న సమయంలో సిటీ స్కాన్ ధర 3 వేలు మాత్రమే వసూలు చేయాలని.. అంతకు మించి ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబులు ప్రభుత్వం ఖరారు చేసిన ప్రకారమే ధరలు వసూలు చేయాలని.. కరోనా విపత్తు వేళ మానవత్వంతో వ్యవహరించాలని సూచించింది. వెంటనే సిటీ స్కాన్ వివరాలు కరోనా డ్యాష్ బోర్డులో నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఖచ్చితమైన నిర్ధారణ కోసం వైద్యులు సిటీ స్కాన్ రిపోర్టును సిఫారసు చేస్తున్నారు. ఖరీదైన ఈ పరీక్షకు కొన్ని చోట్ల పదివేల రూపాయల వరకు వసూలు చేస్తున్న విషయం బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో సిటీ స్కాన్‌పై ఆస్పత్రులకు, ల్యాబ్‌లకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే అమల్లోకి వచ్చిన ఈ ఆదేశాలను అన్ని ఆస్పత్రులు తప్పనిసరిగా పాటించేలా జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పర్యవేక్షించడంతోపాటు తనిఖీలు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.